గవర్నమెంట్ ఆఫీసుల్లో లంచం అడుగుతున్నారా.. ఇదిగో నంబర్.. సేవ్ చేసుకోండి..


 

ANDHRA PRADESH, VISAKHAPATNAM:మన దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో ఒకటి అవినీతి. శాఖలతో సంబంధం లేకుండా ప్రభుత్వ శాఖలు అన్నింటిలోనూ విస్తరించిన లంచం మహమ్మారి.. దేశ పురోభివృద్ధికి ప్రధాన అడ్డంకిగా మారింది. ప్రభుత్వ శాఖలలో లంచాన్ని అరికట్టేందుకు ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ పూర్తి స్థాయిలో ప్రయోజనాలు చేకూరుతున్నాయా అనేది ప్రశ్నార్థకమే. ఈ క్రమంలోనే ఏపీలోని అవినీతి నిరోధక శాఖ అధికారులు.. లంచాన్ని అరికట్టేందుకు కీలక చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలను లంచం అడిగినా, అవినీతికి పాల్పడినా వెంటనే తమకు తెలియజేయాలంటూ ఓ టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులోకి తీసుకువచ్చింది ఏపీ అవినీతి నిరోధక శాఖ. అలాగే లంచం, అవినీతిపై సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని హామీ ఇస్తోంది. ఏపీ ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ ఈ వివరాలను వెల్లడించారు.

గవర్నమెంట్ ఆఫీసుల్లో లంచం అడుగుతున్నారా.. 

ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ శుక్రవారం విశాఖపట్నంలో పర్యటించారు. పాత డెయిరీఫారం కూడలిలోని ఏసీబీ కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడిన ఆయన.. అవినీతిని అరికట్టేందుకు, లంచాన్ని నివారించేందుకు ప్రభుత్వం 1064 టోల్‌ఫ్రీ నెంబర్‌ను అందుబాటులోకి తెచ్చిందని వివరించారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడుతుంటే.. ఈ టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. 1064 నంబర్‌కు ఫోన్ చేసి లంచం డిమాండ్ చేసిన ఉద్యోగి వివరాలు, ఆధారాలు తెలియజేయాలని.. ఆ వివరాలను రికార్డు చేసుకుని.. వాటి ఆధారంగా విచారణ జరుపుతామన్నారు. నిజమని తేలితే తగిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఏసీబీ డీజీ వివరించారు.

అలాగే ప్రభుత్వ విభాగాలలో అవినీతికి పాల్పడుతూ కూడా.. ఆధారాలు దొరక్కుండా చేస్తున్న ఉద్యోగులను గుర్తిస్తామని ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ వెల్లడించారు. అలాంటి వారిని సంబంధిత శాఖలోని ప్రాధాన్యం లేని పోస్టుకు పంపిస్తామన్నారు. ఆ తర్వాత పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరోవైపు ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత జిల్లాల సంఖ్య పెరిగిందన్న ఏసీబీ డీజీ.. పెరిగిన జిల్లాలకు అనుగుణంగా ఏసీబీ ఆఫీసులు పెంచుతామన్నారు. అలాగే సిబ్బందిని కూడా నియమించనున్నట్లు వివరించారు. ఈ విషయం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నివేదిక పంపామని వెల్లడించారు.

మరోవైపు ప్రభుత్వ శాఖల్లో అవినీతిని అంతం చేయాలంటే ప్రజల సహకారం అవసరమని ఏసీబీ డీజీ వెల్లడించారు. ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ అధికారులకు సమాచారం అందించాలన్నారు. ఇందుకోసం ప్రతీ ఆఫీసులోనూ ఏసీబీ ఫోన నంబర్లు, అధికారుల వివరాలు ఏర్పాటు చేశామని.. ఈ విషయం గురించి ప్రజలకు మరింత అవగాహన కల్పిస్తామని అతుల్ సింగ్ వెల్లడించారు.