ANDHRA PRADESH SRIKAKULAM : శ్రీకాకుళం జిల్లా ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. శ్రీకాకుళం నుంచి తిరుపతికి రెగ్యులర్ రైలు సర్వీస్ ప్రారంభమైంది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం తిరుపతి హంసఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును సోమవారం జెండా ఊపి ప్రారంబించారు. సిక్కోలు ప్రజల 75 ఏళ్ల కల నెరవేరిందన్న రామ్మోహన్ నాయుడు.. ఈ రైలు అందుబాటులోకి రావటంతో ప్రాంతీయ అనుసంధానం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. రైలు సర్వీసు ఏర్పాటు చేసినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలియజేశారు.
శ్రీకాకుళం జిల్లా ప్రజల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. జిల్లా చరిత్రలోనే 75 ఏళ్ల తర్వాత తొలిసారిగా శ్రీకాకుళం నుంచి తిరుపతికి రెగ్యులర్ రైలు సర్వీస్ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఇది మనందరికీ గర్వకారణమంటూ అచ్చెన్నాయుడు తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ట్వీట్ చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సౌకర్యం కోసం 17439/40 హంసఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతి ఆదివారం తిరుపతి నుంచి, ప్రతి సోమవారం శ్రీకాకుళం నుంచి ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఏప్రిల్ 13న శ్రీకాకుళం రోడ్ స్టేషన్ నుంచి ఈ రైలు సర్వీసును ప్రారంభించనున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు.
ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛను గుర్తించి, ప్రత్యేక చొరవ చూపించి రైల్వే శాఖతో సమన్వయం చేసుకుంటూ ఈ రైలు సర్వీసు మంజూరులో కీలక పాత్ర పోషించినందుకు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు.. అచ్చెన్నాయుడు ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి పథంలో ఇదొక చరిత్రాత్మక ఘట్టంగా అచ్చెన్నాయుడు అభివర్ణించారు. మరోవైపు తిరుపతి - శ్రీకాకుళం రోడ్ హంసఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు (17439) ప్రతి ఆదివారం తిరుపతి నుంచి సాయంత్రం నాలుగు గంటలకు బయల్దేరుతుంది. సోమవారల మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు శ్రీకాకుళం చేరుకుంటుంది. ఇక శ్రీకాకుళం - తిరుపతి హంసఫర్ ఎక్స్‌ప్రెస్ (17440) ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు శ్రీకాకుళం రైల్వే్ స్టేషన్ నుంచి బయల్దేరుతుంది. మంగళవారం ఉదయం 8 గంటల 10 నిమిషాలకు తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకుంటుంది.
శ్రీకాకుళం - తిరుపతి హంసఫర్ ఎక్‌ప్రెస్ రైలు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, ఎలమంచిలి, దువ్వాడ, సింహాచలం నార్త్, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి రైల్వే స్టేషన్‌లలో ఆగతుంది. ఈ మేరకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు శ్రీకాకుళం సహా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు తరలివెళ్తుంటారు. అయితే శ్రీకాకుళం నుంచి రెగ్యులర్ రైలు సర్వీసు అందుబాటులో లేకపోవటంతో ఇబ్బందులు పడేవారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని శ్రీకాకుళం- తిరుపతి హంసఫర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ ప్రారంభిస్తున్నారు.

Social Plugin