మరింత కఠినంగా టీటీడీ రూల్స్, స్వర్ణ దేవాలయం తరహాలో తిరుమలలోనూ.. ఏపీ ప్రభుత్వం ఆలోచనలు..



ANDHRA PRADESH, TIRUPATI: తిరుమలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో ముఖ్యమైన ఆలోచన చేస్తోంది. అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం తరహాలో.. తిరుమలలోనూ ప్రత్యేక చట్టం తెచ్చే ఆలోచన చేస్తోంది. స్వర్ణ దేవాలయం చట్టాన్ని అధ్యయనం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అలాగే టీటీడీ నిబంధనలు మరింత కఠినతరం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. డిక్లరేషన్ అంశాన్ని పక్కాగా అమలయ్యేలా చూడాలని భావిస్తోంది. ఈ అంశాలపై చంద్రబాబు.. సోమవారం మంత్రులతో చర్చించారు.

తిరుమల తిరుపతి దేవస్థానం ( టీటీడీ ) నిబంధనలు మరింత కఠినతరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా అమృత్‌సర్‌ స్వర్ణ దేవాలయం (Golden Temple) తరహాలో తిరుమలలోనూ ప్రత్యేక చట్టం తీసుకువచ్చే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించినట్లు తెలిసింది. స్వర్ణ దేవాలయం తరహా చట్టాన్ని తిరుమలలోనూ తీసుకొచ్చే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రత్యేక చట్టం ద్వారా తప్పు చేసిన వారి మీద క్రిమినల్‌ చర్యలు తీసుకునే అవకాశముందని అధికారులు చెప్తున్నారు.