Andhra Pradesh Stree Shakti Scheme | ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్త్రీ శక్తి పథకాన్ని ప్రవేశపెట్టింది. 5 రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. మహిళలు ఆధార్ సహా మూడు రకాల గుర్తింపు కార్డులను చూపించి, ఏపీఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. బాలికలు, మహిళలతో పాటు ట్రాన్స్‌జెండర్లు స్త్రీ శక్తి పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు. కండక్టర్లు జీరో ఫేర్ టికెట్ జారీ చేస్తారు. ఉచిత ప్రయాణానికి అయ్యే డబ్బు మొత్తాన్ని ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తుంది. స్త్రీ శక్తి పథకం పూర్తి వివరాలు..
మహిళల అభివృద్ధితోనే దేశ సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. మహిళా అభివృద్ధికి దోహదం చేసేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన మరో పథకం ‘స్త్రీ శక్తి’ (Stree Shakti Scheme). ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించారు. మహిళలు చదువుకోవడానికి, ఉద్యోగాలు చేయడానికి, వ్యాపారాలు చేసుకునేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో నివాసం ఉండే మహిళలందరూ ఈ పథకానికి అర్హులే. ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. 2025 ఆగష్టు 15 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం ప్రారంభమైంది.
స్త్రీ శక్తి పథకం అంటే ఏమిటి?
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం పేరు ‘స్త్రీ శక్తి’. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం 2025 ఆగస్టు 15 నుంచి ఈ పథకం అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్‌లకు ఆర్టీసీ బస్సుల్లో (APSRTC) ఉచితంగా ప్రయాణం కల్పిస్తున్నారు. స్త్రీ శక్తి పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు ప్రభుత్వం ఆగస్టు 11న విడుదల చేసింది. 5 రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని అందిస్తున్నారు.
స్త్రీ శక్తి పథకానికి ఎవరు అర్హులు?
ఆంధ్రప్రదేశ్‌లో స్థిర నివాసి అయుండాలి.
బాలికలు/ మహిళలు అయుండాలి.
ట్రాన్స్‌జెండర్లు కూడా ఉచిత ప్రయాణానికి అర్హులు.
నిర్దిష్ట గుర్తింపు కార్డు కలిగి ఉండాలి.
స్త్రీ శక్తి పథకానికి వర్తించే గుర్తింపు కార్డులు:
ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కోసం ఉద్దేశించిన స్త్రీ శక్తి పథకం కింద లబ్ధి పొందేందుకు మహిళలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివాసి అని తెలిపే ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డును చూపించాలి. ఆర్టీసీ బస్సుల్లో ప్రధానంగా కింద పేర్కొన్న మూడు రకాల గుర్తింపు కార్డులను అంగీకరిస్తారు. అవి:
ఆధార్ కార్డు
ఓటర్ ఐడీ కార్డు
రేషన్ కార్డ
ఏయే బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు?
స్త్రీ శక్తి పథకం ద్వారా కింద పేర్కొన్న బస్సుల్లో మాత్రమే మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.✧ పల్లె వెలుగు✧ అల్ట్రా పల్లె వెలుగు✧ ఎక్స్‌ప్రెస్✧ సిటీ ఆర్డినరీ✧ మెట్రో ఎక్స్‌ప్రెస్APSRTC కి చెందిన దాదాపు 75% బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. మంత్రి నారా లోకేష్ చొరవతో రాష్ట్ర స్థాయిలో 5 రకాల బస్సుల్లో ఈ పథకాన్ని అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి నెలకు రూ.1000 ఆదా అవుతుందని ఆయన చెప్పారు. అయితే, కొన్ని ప్రత్యేక బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతి లేదు.
ఏయే బస్సులకు స్త్రీ శక్తి పథకం వర్తించదు?
నాన్ స్టాప్ బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు.
ఇతర రాష్ట్రాల మధ్య తిరిగే అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు. (జిల్లాల నుంచి తెలంగాణ, కర్నాటక, తమిళనాడు లాంటి అంతర్రాష్ట్ర సర్వీసుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతి లేదు)
సప్తగిరి ఎక్స్ ప్రెస్, ఆల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్ సహా ఇతర ఏసీ బస్సుల్లో స్త్రీ శక్తి పథకం వర్తించదు.
కాంట్రాక్ట్ క్యారేజీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు. (ఆర్టీసీ అద్దెకు తీసుకొని నడిపే ప్రైవేట్ వ్యక్తుల బస్సులు)
చార్టర్డ్ సర్వీసుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు.
ప్యాకేజీ టూర్ బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు.
స్త్రీ శక్తి పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2025 ఆగస్టు 15న సాయంత్రం ప్రారంభించారు. విజయవాడలోని ఉండవల్లి గుహల దగ్గర నుంచి తాడేపల్లి, కనకదుర్గ వారధి మీదుగా విజయవాడ సిటీ టెర్మినల్ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ముఖ్యమంత్రి వెంట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఉన్నారు. దారి పొడవునా మహిళలు భారీగా తరలివచ్చి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. బస్సు వెళ్లే మార్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నేతలు, కార్యకర్తలు బాణసంచా కాల్చి.. డీజే, తీన్మార్ డ్యాన్స్‌లతో సందడి చేశారు.
విజయవాడ సిటీ టెర్మినల్ వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ప్రసంగించారు. ఉచిత బస్సు వల్ల 2.62 కోట్ల మంది మహిళలకు లబ్ధి కలుగుతుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యిందన్నారు. ఆర్టీసీ కండక్టర్లుగా తొలుత మహిళలను తీసుకున్నది తామేనని చెప్పారు. మహిళలు ఆర్టీసీ డ్రైవర్లుగా కూడా రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
జిల్లాల మధ్య ఉచిత ప్రయాణం ఉందా..?
ఒక జిల్లాకు చెందిన వ్యక్తి (మహిళ) ఆ జిల్లా పరిధిలో ఎక్కడైనా ఉచిత ప్రయాణం చేయవచ్చని, ఇతర జిల్లా పరిధిలో ఉచిత ప్రయాణం చేయడానికి అనుమతి ఉండదని గతంలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో స్త్రీ శక్తి పథకం ద్వారా జిల్లాల మధ్య ప్రయాణించేందుకు అనుమతి ఉంటుందా? లేదా? అని చాలా మందిలో సందిగ్ధం ఉంది. అయితే, ప్రభుత్వం గానీ, ఏపీ ఆర్టీసీ గానీ.. ఇప్పటివరకూ అలాంటి నిబంధన గురించి ప్రస్తావించలేదు. జిల్లాల మధ్య ప్రయాణించడానికి ఎలాంటి ఆంక్షలు లేవు. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు.

Social Plugin