ANDHRA PRADESH, GUNTUR: గుంటూరు జిల్లా తెనాలిలో యువకుడి కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది. కూతురు ప్రేమ వివాహం ఇష్టం లేని ఆమె తల్లి.. అల్లుడిని కిడ్నాప్ చేయించారు. మరో నలుగురితో కలిసి అతనిపై దాడి చేసి కిడ్నాప్ చేశారు. అయితే యువకుడి స్నేహితుడు ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. కారును వెంబడించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గుంటూరు జిల్లాలో ఓ కిడ్నాప్ కలకలం రేపింది. తెనాలిలో ఈ ఘటన చోటుచేసుకుంది. కూతురు ప్రేమ వివాహం చేసుకోవటాన్ని జీర్ణించుకోలేని ఓ తల్లి.. అల్లుడిపై దాడి చేసింది. అనంతరం కిడ్నాప్ చేయించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తెనాలికి చెందిన మణికంఠ రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వినుకొండకు చెందిన ఓ యువతిని ప్రేమించిన మణికంఠ.. యువతి తల్లి విజయలక్ష్మికి తమ ప్రేమ వివాహం నచ్చకపోయినా.. యువతిని పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లి జరిగి రెండేళ్లు దాటిపోయింది. అయితే ఈ మధ్య కాలంలో అల్లుడిని, కూతురిని పలుమార్లు ఇంటికి ఆహ్వానించింది విజయలక్ష్మి. అయితే విజయలక్ష్మి వ్యవహారం నచ్చకపోవటంతో మణికంఠ, అతని భార్య విజయలక్ష్మి ఇంటికి వెళ్లలేదు.
ఈ క్రమంలోనే శనివారం ఊహించని ఘటన జరిగింది. శనివారం అర్ధరాత్రి వేళ.. మణికంఠ అత్త విజయలక్ష్మి మరో నలుగురితో కలిసి తెనాలికి వచ్చారు. నేరుగా అల్లుడి ఇంటికి వెళ్లారు. అనంతరం మణికంఠపై దాడి చేయటం మాత్రమే కాకుండా.. అతన్ని కిడ్నాప్ చేశారు. అయితే ఈ విషయం పోలీసుల వద్దకు చేరింది. మణికంఠ స్నేహితుడు ఈ విషయాన్ని పెట్రోలింగ్‌లో ఉన్న ఎస్సై కరీముల్లాకు తెలియజేశారు. వెంటనే అప్రమత్తమైన ఎస్ఐ.. కానిస్టేబుల్‌తో కలిసి గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే నిందితులు వెళ్తున్న కారును గుర్తించి దానిని వెంబడించారు. కారు చేబ్రోలు మండలం చేకూరు వద్దకు రాగానే.. కారును ఆపిన పోలీసులు.. అందులోని ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని గుంటూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Social Plugin