గుంటూరు రైల్వేస్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్.. బెడ్స్, రేట్లు, పూర్తి వివరాలివే..


 

ANDHRAPRADESH,GUNTUR: రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మరో తీపికబురు వినిపించింది. గుంటూరు రైల్వేస్టేషన్‌లో కొత్తగా స్లీపింగ్ పాడ్స్ సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చింది. రైలు ప్రయాణికులు తాత్కాలికంగా బస చేసేలా ఈ స్లీపింగ్ పాడ్స్ ఏర్పాటు చేశారు. అయితే గుంటూరు రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన స్లీపింగ్ పాడ్స్‌ ఫెసిలీటీలో ఎన్ని బెడ్ల్ ఉన్నాయి, అద్దె ఎంత వంటి వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

రైలు ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలను అందించేందుకు రైల్వే అధికారులు ఎప్పటికప్పుడు కొత్త చర్యలు చేపడుతుంటారు. ఈ క్రమంలోనే గుంటూరు రైల్వేస్టేషన్‌లో కొత్త సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. గుంటూరు రైల్వే్ స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్ సౌకర్యాన్ని దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తీసుకువచ్చింది. నాన్ ఫేర్ రెవెన్యూ పెంచే చర్యల్లో భాగంగా ఈ స్లీపింగ్ పాడ్స్ సౌకర్యం ఏర్పాటు చేసింది. రైలు ప్రయాణికులు కొంత సమయం పాటు విశ్రాంతి తీసుకునేలా వీటిని ఏర్పాటు చేశారు.

దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు, తాత్కాలికంగా బస చేసేలా గుంటూరు రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫామ్ నెం. 1, గేట్ నెం. 3 వద్ద ఈ స్లీపింగ్ పాడ్స్ సౌకర్యం అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా ప్రయాణికులు, మరీ ముఖ్యంగా మహిళా ప్రయాణికులు, వారి కుటుంబాలకు తక్కువ ధరలోనే సురక్షితమైన వసతి సౌకర్యాన్ని రైల్వే అధికారులు కల్పిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి స్లీపింగ్ పాడ్స్ సౌకర్యం ఇటు విశాఖపట్నంతోపాటుగా హైదరాబాద్‌లోని చర్లపల్లి రైల్వేస్టేషన్‌లో ఉంది.

గుంటూరులో ఏర్పాటు చేసిన స్లీపింగ్ పాడ్స్ ఫెసిలిటీలో.. మొత్తం 64 పడకలు ఉన్నాయి. ఇందులో 52 సింగిల్ బెడ్లు కాగా.. 12 డబుల్ బెడ్లు. ఇందులో ఫ్యామిలీలు, మహిళా ప్రయాణికులకు ప్రత్యేకంగా బెడ్లు కేటాయించారు. 10 డబుల్ బెడ్స్, 12 సింగిల్ బెడ్స్ వీరికి కేటాయించారు. అలాగే ఉచిత వైఫై, వేడి నీటి సౌకర్యం, స్నాక్స్ బార్, ట్రావెల్ డెస్క్, లాకర్ సౌకర్యం, టాయిలెట్లు కూడా అందుబాటులో ఉంటాయి. అయితే కనెక్టింగ్ ట్రైన్ల కోసం ఎదురుచూసే ప్రయాణికులు.. తాత్కాలికంగా వీటిలో బస చేసేలా ఈ స్లీపింగ్ పాడ్స్‌ను దక్షిణ మధ్య రైల్వే రూపొందించింది.ఇక స్లీపింగ్ పాడ్స్ రేట్లను కూడా అందుబాటు ధరలో ఉంచారు.సింగిల్ బెడ్ల విషయానికి వస్తే.. మూడు గంటల వరకూ  రూ.150.. మూడు గంటల నుంచి 24 గంటల వరకూ అయితే రూ.300 ఛార్జ్ చేస్తారు. ఇక డబుల్ బెడ్ల విషయానికి వస్తే.. మూడు గంటల వరకూ 250 రూపాయలు.. మూడు నుంచి 24 గంటల మధ్యలో అయితే రూ.500 వసూలు చేస్తారు.ఇక గదుల విషయానికి వస్తే మూడు గంటల వరకూ అయితే రూ.300, 24 గంటలు దాటితే రూ.1000 వసూలు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రయాణ సమయంలో రైలు ప్రయాణికులకు సురక్షితమైన వసతి సౌకర్యాలు అందించాలనే ఉద్దేశంతోనే ఈ స్లీపింగ్ పాడ్స్ సౌకర్యం అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు.