విజయవాడ మంగళవారం భారీ వర్ష సూచన.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు..


 

ANDHRA PRADESH,AMRAVATI: ఏపీని మొంథా తుపాను భయపెడుతోంది. భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో ప్రభుత్వం కూడా అప్రమత్తమై చర్యలు చేపడుతోంది. ఇక మంగళవారం రోజున మొంథా తుపాను ప్రభావంతో పలు చోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి. విజయవాడలో మంగళవారం 16 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అప్రమత్తమైంది. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని సూచించింది. మంగళవారం భారీ వర్ష సూచన.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు..

ఆంధ్రప్రదేశ్ తీరాన్ని మొంథా తుపాను సమీపిస్తోంది. మంగళవారం రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం రోజున పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే మంగళవారం విజయవాడలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. విజయవాడలో మంగళవారం 16 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు అలర్ట్ అయ్యారు. భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సూచించారు. తుపాను తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే షాపులు, వాణిజ్య సంస్థలు మూసివేయాలని సూచించారు. అయితే కూరగాయలు, పాల డైరీలు, మెడికల్‌ షాపులు వంటి అత్యవసర కేంద్రాలు తెరుచుకునేందుకు మినహాయింపు ఇచ్చారు.

మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో మంగళవారం రోజున అనవసర ప్రయాణాలను పెట్టుకోవద్దని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు సూచించింది. అత్యవసర సమయంలో సహాయం కోసం కలెక్టరేట్‌లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 9154970454 ఫోన్ నంబర్ అందుబాటులో ఉంచారు. అలాగే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో 0866 2424172 , 0866 2422515 , 0866 2427485 ఫోన్ నంబర్లను ఏర్పాటు చేశారు. వీఎంసీ పరిధిలో 34 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరోవైపు మొంథా తుపాను నేపథ్యంలో 8 జిల్లాలకు ఆకస్మిక వరదల ముప్పు ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. విశాఖ, విజయనగరం, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, కడప ఉమ్మడి జిల్లాల్లో ఆకస్మిక వరదలకు అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

మొంథా తుపాను నేపథ్యంలో మంగళవారం రోజున 8 విమాన సర్వీసులను రద్దు చేశారు. గన్నవరం విమానాశ్రయానికి వచ్చే ఎనిమిది విమాన సర్వీసులను రద్దు చేశారు. అటు దక్షిణ మధ్య రైల్వే కూడా తుపాను ముప్పును ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. డీఆర్ఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ విజయవాడ డివిజన్ పరిధిలోని అన్ని బ్రాంచుల అధికారులతో సమావేశమయ్యారు.

ఆపరేటింగ్ , ఇంజనీరింగ్ , ఎలక్ట్రికల్ , మెకానికల్ , కమర్షియల్ , మెడికల్ విభాగాలను అప్రమత్తం చేశారు. కంట్రోల్ రూమ్‌లు 24 గంటలూ అందుబాటులో ఉండాలని సూచించారు. రైల్వే ట్రాకులు, వంతెనల వద్ద పెట్రోలింగ్ బృందాలు ఏర్పాటు చేయాలని సూచించారు. విజయవాడ, రాజమండ్రి, కాకినాడ టౌన్, భీమవరం, తెనాలితో సహా కీలకమైన రైల్వేస్టేషన్లలో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.