ఏపీ అభివృద్ధిలో కీలక ముందడుగు.. కొత్తగా DDO ఆఫీస్‌లకు పవన్ కళ్యాణ్ శ్రీకారం


 

ANDHRA PRADESH AMARAVATI: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు నవంబర్ 1 నుంచి ప్రాంతీయ అభివృద్ధి అధికారుల (డీడీఓ) కార్యాలయాలు ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. ఈ నిర్ణయం ప్రకటించారు. పాలనపరమైన సంస్కరణల ఫలితాలు ప్రజలకు చేరాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు నిధుల కొరత లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో కీలక పాలనాపరమైన సంస్కరణలు చోటుచేసుకుంటున్నాయి. స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా నవంబర్ 1వ తేదీ నుంచి ప్రాంతీయ అభివృద్ధి అధికారుల (డీడీఓ) కార్యాలయాలు ప్రారంభించనున్నారు. గురువారం (సెప్టెంబర్ 23) పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. పంచాయతీల పాలన సంస్కరణల ఫలితాలు.. ప్రజలకు అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఉపముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

రాష్ట్రంలో స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ పాలనాపరమైన సంస్కరణలు తీసుకువచ్చామని.. వాటి ఫలాలు ప్రజలకు సక్రమంగా అందించే బాధ్యత అధికారులపై ఉందని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. నవంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రాంతీయ అభివృద్ధి అధికారులు(డీడీఓ) కార్యాలయాలు ప్రారంభించాలని ఆదేశించారు. క్లస్టర్ విధానం రద్దు చేసి.. 13,351 గ్రామ పంచాయతీలను స్వతంత్ర యూనిట్లు చేయడం ద్వారా.. ప్రజలకు మెరుగైన సేవలు అందించే వెసులుబాటు తీసుకువచ్చినట్లు చెప్పారు.

గ్రామాల్లో కనీస మౌలిక వసతుల కల్పనకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పంచాయతీలు, గ్రామీణాభివృద్ధికి నిధులు సమకూరుస్తున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. 15వ ఆర్థిక సంఘం నిధులతోపాటు.. పంచాయతీలు ఆర్థిక స్వయం ప్రతిపత్తి సాధించే విధంగా సరికొత్త ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. నిధులు సమకూర్చడంలో, పాలనాపరమైన సంస్కరణల్లో కూటమి ప్రభుత్వం ఎంతో సానుకూల దృక్పథంతో ఉందని అన్నారు. ఆ సంస్కరణ ఫలితాలు ప్రజలకు చేర్చి.. పల్లెల అభివృద్ధిలో ఉద్యోగులు క్రియాశీలక బాధ్యత తీసుకోవాలన్నారు. నిధుల వినియోగం, పాలన సంస్కరణల అమలుపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు సమీక్షలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. పల్లె పండగ 2.0 ద్వారా గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలపై పూర్తి ప్రణాళిక అందించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు.

పంచాయతీ రాజ్ శాఖను ఇష్టంగా ఎంచుకున్నానని గతంలో ఓ సందర్భంలో చెప్పిన పవన్ కళ్యాణ్.. ఆ శాఖలో కీలక సంస్కరణలు, కొత్త విధానాలు తీసుకువస్తున్నారు. గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాలనే లక్ష్యంతో ప్రారంభించిన పల్లె పండుగ కార్యక్రమానికి.. పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోనే బీజం పడింది. ఇటీవల పల్లె పండుగ 2.0 కార్యాక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.మరోవైపు, పంచాయతీల పునర్వ్యవస్థీకరణలో భాగంగా.. పంచాయతీలను నాలుగు గ్రేడులుగా వర్గీకరించారు. పంచాయతీ కార్యదర్శులను.. పంచాయతీ అభివృద్ధి అధికారిగా (PDO) మార్చారు. ఆగస్టు 2024లో.. రాష్ట్రంలోని 13,326 పంచాయతీలలో ఒకే రోజు గ్రామసభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సృష్టించింది పంచాయతీరాజ్ శాఖ.