నా హత్యకు కుట్ర చేశారు.. ఇద్దర్ని పట్టుకున్నాం.. టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు


 ANDRAPRADESH, NELURU: నెల్లూరు జిల్లా కావలి టీడీపీ ఎమ్మెల్యే డీవీ (కావ్య) కృష్ణారెడ్డి క్వారీ దగ్గర కొందరు డ్రోన్‌తో సంచరించడం కలకలం రేపింది. జలదంకి మండలం అన్నవరంలో మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగింది.. వారి దగ్గర మారణాయుధం కూడా లభ్యమైందని సమాచారం. తనను హత్య చేసేందుకే వారు వచ్చారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఎమ్మెల్యేకు చెందిన క్వారీ దగ్గర కొందరు డ్రోన్‌తో వీడియో తీస్తుండగా సిబ్బంది వారిని పట్టుకున్నారు. అనంతరం వారిని జలదంకి పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన వారిలో ఇస్సారపు వేణు, డ్రోన్‌ ఆపరేటర్‌ గోళ్ల వినోద్‌ ఉన్నారు. ఆత్మకూరు రాజేశ్, దామెర్ల శ్రావణ్‌ అనే ఇద్దరు యువకులు పరారయ్యారు.

తనపై హత మార్చేందుకు వారు వచ్చారన్నారు కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి . వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాలతో ఇదంతా చేశారని.. తనను చంపేందుకు రెక్కీ నిర్వహించారని ఆరోపించారు. వాస్తవానికి తాను మంగళవారం మామిడి తోటకు వెళతానని తెలుసని.. కానీ తాను చివరి నిమిషంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు మంగళగిరి వెళ్లానన్నారు. 

తాను మామిడితోట, క్రషర్‌లో డ్రోన్‌లతో ‌వెతికారని చెప్పుకొచ్చారు. తమ అనుచరులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తే.. వారిపైనా దాడి చేశారన్నారు. డ్రోన్ ఎగరేసినవారిని పట్టుకుని అడిగితే వారు ప్రతాప్ కుమార్ రెడ్డి పంపినట్లు చెప్పారన్నారు.

ఎమ్మెల్యే కృష్ణారెడ్డి క్రషర్ సూపర్‌వైజర్ జలదంకి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన యజమాని, ఎమ్మెల్యే కృష్ణారెడ్డిని చంపడానికి కొందరు వ్యక్తులు వచ్చారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అలగే డ్రోన్‌తో క్రషర్ చిత్రీకరణ కోసం వచ్చిన వ్యక్తులు తనను పొడవడానికి ప్రయత్నించారని ఏడుకొండలు ఆరోపించారు. మరొక వ్యక్తి రాయితో దాడి చేయడంతో కాలికి గాయమైందని తెలిపారు.

తమ సిబ్బంది రావడంతో నిందితులు డ్రోన్ కెమెరా, కత్తి వదిలి పారిపోయారన్నారు. వారు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అనుచరులని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కుట్రకు సంబంధించిన ఆధారాలను, అనుమానితుల పేర్లను పోలీసులకు అందజేశామని కృష్ణారెడ్డి తెలిపారు. ఈ విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. సీఎం చంద్రబాబును కలిసి కుట్రదారుల వివరాలు అందజేస్తానన్నారు.