ప్రభుత్వం కీలక నిర్ణయం.. విశాఖ ఆర్డీవో, డీఆర్వోలపై బదిలీ వేటు..


 

ANDHRA PRADESH, VISAKHAPATNAM: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విభేదాలతో రచ్చకెక్కిన విశాఖ ఆర్డీవో, డీఆర్వోలను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. తక్షణమే వీరిద్దరినీ రిలీవ్ చేయాలని విశాఖ కలెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. అలాగే ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయాలని ఆర్డీవో శ్రీలేఖ, డీఆర్వో భవానీ శంకర్‌లను ఆదేశించింది. మరోవైపు వీరిద్దరి స్థానంలో వేరేవారికి బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం.. వీరికి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం ఆర్డీవో శ్రీలేఖ , డీఆర్వో భవానీ శంకర్‌లను బదిలీ చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్డీవో శ్రీలేఖ, డీఆర్వో భవానీ శంకర్ మధ్యన విభేధాలు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. డీఆర్వో భవానీ శంకర్ తహసీల్దార్‌ కార్యాలయాల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారని ఆర్డీవో శ్రీలేఖ ఇటీవల కలెక్టర్‌కు లేఖ రాశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అలాగే పెందుర్తి మండలంలో ఓ విగ్రహం తొలగింపు వ్యవహారంలో ఆర్డీవో శ్రీలేఖకు కలెక్టర్‌ ఇటీవల షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఇద్దరిని ప్రభుత్వం బదిలీ చేసింది.

ఇద్దరినీ ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయాలని ఆదేశించింది. వీరిద్దరినీ తక్షణమే రిలీవ్ చేయాలని కలెక్టర్‌ను ఆదేశించిన ప్రభుత్వం.. వీరికి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. హెచ్‌బీసీఎల్‌ భూసేకరణ విభాగం డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్న ఎస్‌.విద్యాసాగర్‌కు విశాఖపట్నం ఆర్డీవోగా బాధ్యతలు అప్పగించారు. విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ఉన్న మయూర అశోక్‌లకు డీఆర్వో బాధ్యతలను అప్పగించింది.

మరోవైపు విశాఖ ఆర్డీవో శ్రీలేఖ, డీఆర్వో భవానీ శంకర్ మధ్య గత కొంతకాలంగా విభేదాలు నెలకొన్నాయి. ఇదే సమయంలో డీఆర్వో భవానీ శంకర్ నిత్యావసర సరుకుల కోసం ప్రతినెలా తహశీల్దారు కార్యాలయానికి ఇండెంట్‌ పెడుతున్నారంటూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు డీఆర్వో శ్రీలేఖ. అయితే ఈ విషయం బయటకు లీక్ అవడంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. మరోవైపు ఆర్డీవో శ్రీలేఖకు కూడా ఇటీవల కలెక్టర్ నుంచి షోకాజ్ నోటీసులు వచ్చాయి. పెందుర్తిలో ఓ విగ్రహం తొలగింపు వ్యవహారంలో నిబంధనలు పాటించలేదని ఆర్డీవోపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో సంజాయిషీ ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ ఘటన తర్వాత డీఆర్వో మీద ఫిర్యాదు చేస్తూ ఆర్డీవో రాసిన లేఖ వ్యవహారం బయటకు వచ్చింది. ఇది పెద్దఎత్తున చర్చకు దారి తీయగా.. దీనిపై అమరావతి నుంచి ఉన్నతాధికారులు ఫోన్ చేసి వివరాలు అడిగినట్లు సమాచారం. అయితే ఈ వ్యవహారం మీద సీరియస్ అయిన ప్రభుత్వం.. ఇద్దరు అధికారులపైనా బదిలీ వేటు వేసింది. మరోవైపు గతేడాదే ఈ ఇద్దరు అధికారులు బదిలీ మీద జిల్లాకు వచ్చారు. మొదట్లో మంచిగానే ఉన్నప్పటికీ ఇటీవలి కాలంలో విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది.