KERALA, SABARIMALA:శబరిమల ఆలయం మరో వివాదంలో చిక్కుకుంది ఎలాంటి అనుమతులు లేకుండా ఆలయంలో మరమ్మత్తులు చేపట్టడాన్ని కేరళ హైకోర్టు తీవ్రంగా పరిగణించింది వెంటనే పనులు ఆపేయాలని ఆదేశాలను ఇచ్చింది ఈ సందర్భంగా 2007 నాటి సుప్రీంకోర్టు తీర్పును గుర్తు చేసింది మొదట ఈ పనులను సన్నదానంలోనూ చేయాలని నిర్ణయించినా... దాన్ని కాదని... చెన్నైకి తరలించి చేయడాన్ని హైకోర్టు తప్పు పట్టింది ఇది నిబంధనలకు విరుద్ధమని తేల్చి చెప్పింది వెంటనే వాటిని శబరిమలకు తీసుకురావాలని ఆదేశాలిచ్చింది
శబరిమల సన్నిధానంకు సంబంధించి కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఆలయంలోని ద్వారపాలకుల విగ్రహాలకు ఉన్న బంగారు పూత కలిగిన రాగి తొడుగులను తొలగించడం తీవ్ర దుమారానికి కారణం అయింది. అయితే ఆ రాగి తొడుగులను.. మరమ్మతులకు పంపించడంపై ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డుపై కేరళ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పెషల్ కమీషనర్‌కు సమాచారం ఇవ్వకుండా, కోర్టు అనుమతి లేకుండా ఇలాంటి చర్యలు చేపట్టడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. వెంటనే మరమ్మతు పనులను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలను పట్టించుకోకుండా, అనుమతి లేకుండా మరమ్మతులకు పంపించిన రాగి తొడుగులను తక్షణమే శబరిమల ఆలయానికి తీసుకురావాలని హైకోర్టు తేల్చి చెప్పింది.ఆలయ మరమ్మతు పనులకు సంబంధించి ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని జస్టిస్ రాజా విజయరాఘవన్ వీ, జస్టిస్ కే వీ జయకుమార్‌లతో కూడిన కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్.. తీవ్రంగా తప్పుపట్టింది. కోర్టు ఆమోదం లేకుండానే ఈ మరమ్మతు పనులను చెన్నైలో నిర్వహించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
2019లో ఉన్నీకృష్ణన్ పొట్టి అనే భక్తుడు విరాళంగా ఇచ్చిన ఈ బంగారు తొడుగులకు.. 6 ఏళ్లలోనే లోపాలు తలెత్తాయి. దీంతో వాటిని ఎలక్ట్రోప్లేటింగ్ కోసం చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్స్ సంస్థకు పంపించారు. అయితే ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డ్ నిబంధనల ప్రకారం.. ఆలయంలోని మరమ్మతు పనుల గురించి కోర్టుకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దీంతో ఈ విషయంపై దేవస్వం బోర్డ్ క్షమాపణలు చెప్పింది.
ఆలయానికి బంగారు పూతతో ఉన్న రాగి తొడుగులకు చేపట్టిన మరమ్మతు పనులను వెంటనే నిలిపివేయాలని.. చెన్నైకి తరలించిన ఆ తొడుగులను తక్షణమే తిరిగి శబరిమలకు తీసుకురావాలని కేరళ హైకోర్టు ఆదేశించింది. అయితే సెప్టెంబర్ 9వ తేదీన మరమ్మతులు ప్రారంభం అయ్యాయని.. వాటిలో కొన్నింటికి పాలిష్ కూడా పూర్తి చేశారని హైకోర్టుకు దేవస్వం బోర్డు తరఫున లాయర్లు విన్నవించారు.అయితే ముందుగా ఆ తొడుగులకు మరమ్మతు పనులు.. సాంప్రదాయ పద్ధతిలో 303 గ్రాముల బంగారంతో శబరిమల సన్నిధానంలోనే పనులు చేయాలని తిరువాభరణం కమీషనర్ సిఫార్సు చేశారు. కానీ ఆ నిర్ణయాన్ని మార్చేసి.. వాటిని చెన్నైకి పంపించడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఇది దేవస్వం బోర్డు మాన్యువల్‌కు విరుద్ధమని వెల్లడించింది.
ఈ సందర్భంగా 2007లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పును కేరళ హైకోర్టు గుర్తు చేసింది. ఏ ఏ గోపాలకృష్ణన్ వర్సెస్ కొచ్చిన్ దేవస్వం బోర్డు కేసులో.. దేవాలయాల ఆస్తులను రక్షించడం ట్రస్టీలు, సిబ్బంది ప్రాథమిక విధి అని సుప్రీంకోర్టు 2007 తేల్చి చెప్పింది.ఈ క్రమంలోనే ఈ మరమ్మతుల వ్యవహారానికి సంబంధించిన అన్ని రికార్డులను వెంటనే స్వాధీనం చేసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
విరాళం ఇచ్చిన భక్తుడు ఉన్నికృష్ణన్ పొట్టి.. వాటికి పనులు చేసే స్మార్ట్ క్రియేషన్స్ సంస్థను అదనపు ప్రతివాదులుగా చేర్చాలని హైకోర్టు ఆదేశించింది. ఆర్థిక, కమ్యూనికేషన్ రికార్డులను సమర్పించాలని ఆదేశాలు ఇచ్చింది. అలాగే దీనికి సంబంధిత ఫైళ్లను వెంటనే సమర్పించాలని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్‌ను ఆదేశించింది.
Social Plugin