అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అప్డేట్స్...


 ANDRAPRADESH, VIJAYANAGARAM : విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు పురోగతిపై కీలక అప్డేట్ వచ్చింది ఇప్పటివరకు బాగాపురం ఎయిర్పోర్ట్ పనులు 86% వరకు పూర్తి అయినట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు శనివారం భోగాపురం విమానాశ్రయం  నిర్మాణ పనులను పరిశీలించిన రామ్మోహన్ నాయుడు పనుల పురోగతిపై  వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం 2026 జూన్ నుంచి భోగాపురంలో విమాన  సర్వీసులు ప్రారంభించనున్నట్లు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే మరో ఎయిర్‌పోర్టు అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఏడుచోట్ల విమానాశ్రయాలు అందుబాటులో ఉన్నాయి. వీటికి తోడుగా మరో 9 నెలల్లో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం (భోగాపురం ఎయిర్‌పోర్టు) అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 2026 జూన్ నాటికి అందుబాటులోకి తెస్తామని తెలిపారు. 2026 జూన్‌లో భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి విమాన సర్వీసులను ప్రారంభిస్తామని వెల్లడించారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులను కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు శనివారం పరిశీలించారు. ఇప్పటి వరకూ జరిగిన నిర్మాణ పనులు, పూర్తి కావాల్సిన పనులు, పురోగతిపై అధికారులతో చర్చించారు.

 అనంతరం విలేకర్లతో మాట్లాడిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.. భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు 86 శాతం పూర్తయ్యాయని వెల్లడించారు. వచ్చే ఏడాది నుంచి జూన్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభిస్తామన్నారు. విశాఖపట్నం నుంచి భోగాపురం విమానాశ్రయానికి రోడ్డు అనుసంధానంపై ఇప్పటికే అనేక సార్లు సమీక్షించామని.. వచ్చే ఏప్రిల్ నాటికి ఈ రహదారి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అలాగే విశాఖపట్నంలో బీచ్‌ కారిడార్‌ నిర్మాణం కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారు చేస్తున్నట్లు వివరించారు.

మరోవైపు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రెండు దశల్లో పూర్తి చేయాలని ప్రణాళికలు రచించిన సంగతి తెలిసిందే. తొలి దశలో రూ.4,592 కోట్లతో 22 ఏరో బ్రిడ్జ్‌లు, టెర్మినల్‌ బిల్డింగ్‌ నిర్మిస్తున్నారు. మొత్తం 2,203 ఎకరాల్లో ఎయిర్‌పోర్టు నిర్మించనున్నారు. మరోవైపు ఎయిర్‌పోర్టు ఇతరత్రా అవసరాల కోసం ఇటీవల ఏపీ ప్రభుత్వం భోగాపురం విమానాశ్రయానికి మరో 500 ఎకరాల భూమిని అదనంగా కేటాయించింది.

ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తైన తర్వాత ఆరంభంలో ఏడాదికి 60 లక్షలమంది ప్రయాణికులకు సేవలు అందించేలా ప్రణాళికలు రచించారు. ఆ తర్వాత క్రమక్రమంగా ఈ సంఖ్యను నాలుగు కోట్లకు పెంచాలని కేంద్రం భావిస్తోంది. జూన్ నాటికి ఎయిర్‌పోర్టు నుంచి విమాన సేవలు ప్రారంభించేలా చకచకా పనులు జరుగుతున్నాయి.