కోర్టులు రికవరీ ఏజెంట్లు కాదు.. ఇదేం పద్ధతి: సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం



 

INDIA, DELHI: రుణాలు రికవరీ వంటి సివిల్ వివాదాలపై క్రిమినల్ కేసులు నమోదుచేయడాన్ని సుప్రీంకోర్టు మండిపడింది.. కోర్టులు డబ్బులు రికవరీ చేసే ఏజెంట్లు కావని తేల్చి చెప్పింది. రుణాలు వసూలు చేయడానికి అరెస్టులను సాధనంగా వాడకూడదని జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం పేర్కొంది. సివిల్ వివాదాల్లో క్రిమినల్ చట్టాలను దుర్వినియోగం చేయకుండా పోలీసులు అత్యంత జాగ్రత్తగా పరిశీలించాలని కోర్టు సూచించింది. ప్రతి జిల్లాకు రిటైర్డ్ జిల్లా జడ్జిని నోడల్ అధికారిగా నియమించాలని కోర్టు అభిప్రాయపడింది.

న్యాయస్థానాలు డబ్బులు రికవరీ చేసే ఏజెంట్లు కాదని సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సివిల్ వివాదాలను క్రిమినల్ కేసులుగా మార్చే ట్రెండ్‌పై      సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ కేసు విచారణ సమయంలో పైవిధంగా అత్యున్నత న్యాయస్థానం స్పందించింది. రుణాల రికవరీ వంటి సివిల్ వివాదంలో అరెస్ట్‌ను ఓ సాధానంగా వాడకూడదని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్‌ల ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ వివాదంపై కిడ్నాప్ కేసు నమోదుచేయడం పట్ల అభ్యంతరం తెలిపింది. ఇటీవల కాలంలో సివిల్ వివాదాలపై క్రిమినల్ కేసులు నమోదుచేస్తోన్న ఈ ధోరణి చట్టాన్ని దుర్వినియోగం చేసేలా ఉందని వ్యాఖ్యానించింది. అంతేకాదు, ఇలాంటి చర్యలు న్యాయ వ్యవస్థకు తీవ్ర ముప్పు అని పేర్కొంది.

బకాయిలు వసూళ్లకు న్యాయస్థానాలేమీ రికవరీ ఏజెంట్లు కావు.. న్యాయవ్యవస్థ దుర్వినియోగానికి ఏమాత్రం అనుమతించబోం అని ధర్మాసనం తేల్చిచెప్పింది. అరెస్టులకు ముందు అవి క్రిమినల్ కేసులా? సివిల్ వివాదాలా? అని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించింది. ఇటువంటి కేసులు పోలీసుల్ని క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టేస్తాయని,ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం  తరఫున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్‌ అన్నారు. కొన్ని సందర్భాల్లో గందరగోళం ఉంటుందని, సివిల్ వివాదాల్లో క్రిమినల్ చట్టాలు దుర్వినియోగం కాకుండా నిరోధించేందుకు తెలివిగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు  పేర్కొంది. కాగా ఈ విషయంలో పోలీసుల పరిస్థితిని కోర్టు అర్థం చేసుకుంటుందని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు.

ఒకవేళ శిక్షార్హమైన నేరం జరిగినట్లు ఆరోపణలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోతే 2013లో లలితా కుమారి కేసులో సుప్రీంకోర్టు తీర్పును పోలీసులు పాటించలేదని విమర్శలు ఎదుర్కొవలసి వస్తుందని న్యాయమూర్తులు చెప్పారు. ప్రతి జిల్లాకు ఒక నోడల్ ఆఫీసర్‌గా సాధ్యమైనంతవరకు రిటైర్డ్ జిల్లా జడ్జి నియమించాలని న్యాయమూర్తులు పేర్కొన్నారు. నోడల్ అధికారిని పోలీసులు సంప్రదించి, అది సివిల్ కేసా? లేక క్రిమినల్ కేసా? అనేది తెలుసుకుని ఆ తర్వాత చట్ట ప్రకారం ముందుకు వెళ్లొచ్చని కోర్టు అభిప్రాయపడింది. దీనిపై రెండు వారాల్లోగా వివరాలను సమర్పించాలని సొలిసిటర్ జనరల్‌ను ఆదేశించింది.