ANDHRA PRADESH, ELURU: ఉమ్మడి గోదావరి జిల్లావాసుల ఎదురుచూపులు ఫలించాయి. గోదావరి జిల్లాలను కలుపుతూ వశిష్ట గోదావరి నదిపై తలపెట్టిన వంతెన నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. వంతెన నిర్మాణంపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఓ రైతు హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే సోమవారం రోజున సుప్రీంకోర్టు ఈ పిటిషన్ డిస్మిస్ చేసింది. దీంతో వశిష్ట గోదావరి నదిపై వంతెన నిర్మాణానికి న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి.
ఉభయ గోదావరి జిల్లావాసులకు తీపికబురు. వశిష్ఠ గోదావరి నది మీద ఏళ్ల కిందట తలపెట్టిన వంతెన నిర్మాణానికి మార్గం సుగమమైంది. వంతెన నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న న్యాయపరమైన చిక్కులు వీడాయి. సుప్రీంకోర్టు సోమవారం రోజున దీనికి సంబంధించిన కీలక తీర్పు వెలువరించింది. నరసాపురం-సఖినేటిపల్లి మధ్యన వశిష్ఠ గోదావరి నది వంతెన నిర్మించాలని ఈ ప్రాంత ప్రజలు గత కొన్నేళ్ల ఏళ్ల నుంచి కోరుతున్నారు. అయితే వంతెన నిర్మాణం అంశం కోర్టులో పెండింగ్‌లో ఉండటంతో ఆ దిశగా అడుగులు పడలేదు. ఈ నేపథ్యంలో నరసాపురం ఎంపీ, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ దిల్లీలోని నేషనల్ హైవే అథారిటీ అధికారులతో పలుమార్లు చర్చలు జరిపారు. జిల్లా అభివృద్ధిలో రహదారి అవసరాన్ని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కేంద్ర మంత్రి వారికి వివరించారు.
మరోవైపు టీడీపీ ప్రభుత్వం హయాంలో వశిష్ట గోదావరి నదిపై వంతెన నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారైంది. వైసీపీ హయాంలో రామేశ్వరం రాజుల్లంక మధ్య భూసేకరణ చేపట్టారు. రూ.550 కోట్లతో పీపీపీ విధానంలో వంతెన నిర్మాణానికి టెండర్లు కూడా పిలిచారు. అయితే గుడిమెల్లంకకు చెందిన ఓ రైతు దీనిపై అభ్యంతరం తెలుపుతూ హైకోర్టు, సుప్రీంకోర్టులలో పిటిషన్లు వేశారు. సుప్రీంకోర్టు తాజాగా ఆ పిటిషన్ కొట్టివేయటంతో వశిష్ట గోదావరి నదిపై వంతెన నిర్మాణానికి ఉన్న న్యాయపరమైన చిక్కులు తొలగిపోయాయి.
నరసాపురం పట్టణ పరిధిలోనే నిర్మించాలి..
మరోవైపు వశిష్ట గోదావరి నదిపై నిర్మించనున్న వంతెనను నరసాపురం పట్టణ పరిధిలోనే చేపట్టాలని డిమాండ్లు మొదలయ్యాయి. నరసాపురం పట్టణ పరిధిలో వెంటనే నిర్మాణం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండు చేశారు. వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తూ బుధవారం రోజున పంటురేవు వద్ద నిరసన ప్రదర్శన చేశారు.

Social Plugin