INDIA, DELHI: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్. చెన్నై కోల్‌కతా జాతీయ రహదారిపై ముప్పవరం నుంచి కాజా వరకు 100 కిలోమీటర్ల భాగాన్ని యాక్సెస్ కంట్రోల్డ్ రహదారిగా అభివృద్ధి చేయనున్నారు. ఈ హైవేపై వాహనాల రద్దీ దృష్టిలో పెట్టుకుని.. యాక్సెస్ కంట్రోల్ కారిడార్‌గా అభివృద్ధి చేసేందుకు ఎన్‌హెచ్ఏఐ ప్రణాళికలు రూపొందిస్తోంది. అందులో భాగంగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపొందించేందుకు టెండర్లు పిలిచింది. టెండర్ పొందిన కంపెనీ ఈ డీపీఆర్ పనులు ప్రారంభిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్రం శుభవార్త చెప్పింది. చెన్నై కోల్‌కతా నేషనల్ హైవేపై.. ముప్పవరం నుంచి కాజా వరకు ఉన్న భాగాన్ని యాక్సెస్ కంట్రోల్డ్ రహదారిగా నిర్మించనున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఈ జాతీయ రహదారి ఆరు వరుసలుగా ఉంది. అయితే అనేక చోట్ల ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఉండటం, కొడికొండ ముప్పవరం హైవేపై వచ్చే వాహనాలు కూడా కలవడం వల్ల.. రహదారిపై రద్దీ పెరుగుతోంది. యాక్సెస్ కంట్రోల్డ్ కారిడార్‌గా అభివృద్ధి చేస్తే.. వాహనాల వేగం పెరుగుతుందని కేంద్రం యోచిస్తోంది. అంతేకాకుండా, ఈ రహదారి యాక్సెస్ కంట్రోల్డ్‌గా మారితే.. సమీప గ్రామాల సౌకర్యార్థం కొత్త సర్వీస్ రోడ్లు రానున్నాయి. ఈ కారిడార్‌కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారుచేసేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) కసరత్తు చేస్తోంది.
ఇప్పటికే డీపీఆర్ రూపొందించేందుకు టెండర్లు ఆహ్వానించారు
చెన్నై కోల్‌కతా జాతీయ రహదారిపై బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలోని ముప్పవరం నుంచి.. గుంటూరు జిల్లా కాజ వరకు 100 కిలోమీటర్ల మార్గాన్ని యాక్సెస్ కంట్రోల్ కారిడార్‌గా మార్చనున్నారు. కాగా, ఇప్పటికే బెంగళూరు కడప విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ యాక్సెస్ కంట్రోల్డ్ కారిడార్ నిర్మాణం చేపట్టింది కేంద్రం. అందులో భాగంగా శ్రీసత్యసాయి జిల్లాలోని బెంగళూరు- హైదరాబాద్ జాతీయ రహదారి 44లో ఉన్న కొడికొండ నుంచి.. బాపట్ల జిల్లాలోని చెన్నై కోల్‌కతా హైవే 16పై ముప్పవరం వరకు కొత్త రహదారి నిర్మిస్తున్నారు. 342 కిలోమీటర్ల మేర ఈ కారిడార్‌ను 14 ప్యాకేజీలుగా అభివృద్ధి చేస్తున్నారు.
నాలుగు వరుసలుగా చేపట్టిన బెంగళూరు కడప విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ యాక్సెస్ కంట్రోల్ కారిడార్.. ముప్పవరం వద్ద చెన్నై కోల్‌కతా హైవేతో అనుసంధానం అవుతుంది. దీంతో ఇప్పటికే చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాలకు. అదనంగా కొడికొండ- ముప్పవరం కొత్త హైవే నుంచి వచ్చే వాహనాలు కలుస్తాయి. దీంతో జాతీయ రహదారి 16పై రద్దీ మరింత పెరుగుతుంది. అందుకోసమే.. ముప్పవరం నుంచి కాజ సమీపంలోని విజయవాడ పశ్చిమ బైపాస్ మొదలయ్యే ప్రాంతం వరకు.. ఇప్పుడున్న ఆరు వరుసల రహదారిని 100 కిలోమీటర్ల మేర యాక్సెస్ కంట్రోల్డ్‌గా మారుస్తారు.
సమీప గ్రామాలకు సర్వీస్ రోడ్లు..
100 కిలోమీటర్ల మేర యాక్సెస్ కంట్రోల్డ్ కారిడార్ చేపడితే.. ఇప్పటివరకు అనేక గ్రామాల వద్ద ఉన్నట్లుగా.. చెన్నై కోల్‌కతా హైవేపైకి వెళ్లేందుకు, హైవే నుంచి గ్రామాల్లోకి వెళ్లేందుకు వీలు ఉండదు. 100 కిలోమీటర్ల భాగంలో కేవలం నాలుగైదు చోట్ల మాత్రమే ఎంట్రీ, ఎగ్జిట్ ఉంటుంది. అంతేకాకుండా.. ప్రస్తుతం కొన్ని గ్రామాల వద్దే ఉన్న సర్వీస్ రోడ్లు.. 100 కిలోమీటర్ల పొడవునా నిర్మిస్తారు. యాక్సెస్ కంట్రోల్డ్ కారిడార్ వల్ల.. చెన్నై, బెంగళూరు నుంచి వచ్చే వాహనాలు వేగంగా అమరావతికి చేరుకునే అవకాశం ఉంటుంది.

Social Plugin