ANDRAPRADESH, KURNOOL:దేశంలోనే మొట్టమొదటి అతిపెద్ద ప్రైవేట్ బంగారు గని ఆంధ్రప్రదేశ్ లోనే త్వరలోనే ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు ఆ బంగారు గని నిర్వహిస్తున్న సంస్థ వెల్లడించింది మొదట తక్కువ స్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించి ఆ తర్వాత దానిని భారీగా పెంచనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ బంగారు గని పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే దేశ బంగారం అవసరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడటం కాస్త తగ్గుతుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు
బంగారం అంటే భారత్‌లో కేవలం ఒంటిపై వేసుకునే ఆభరణాలుగా మాత్రమే కాకుండా.. అదో ఆస్తిగా కూడా భావిస్తారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో బంగారానికి అత్యంత ప్రాధాన్యత కూడా ఉంటుంది. అందుకే భారతీయులు భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తారు. వాటిని అవసరమైన సమయాల్లో తాకట్టు పెట్టి.. డబ్బును తీసుకుంటారు. అయితే ప్రపంచంలోని అన్ని దేశాల కన్నా ఎక్కువగా బంగారాన్ని భారత్ వినియోగిస్తున్నా.. ఉత్పత్తిలో మాత్రం చాలా వెనకబడి ఉంది. ఇక మన దేశం.. విదేశాల నుంచి చమురు తర్వాత అత్యంత ఎక్కువగా దిగుమతి చేసుకునేది బంగారమే కావడం గమనార్హం. అయితే తాజాగా భారత్‌లోనే తొలి అతిపెద్ద ప్రైవేట్ బంగారు గని నుంచి బంగారాన్ని వెలికితీయనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి, ఎర్రగుడి, పగిదిరాయి గ్రామాల్లో ఉన్న ఈ బంగారు గని నుంచి బంగారాన్ని వెలికితీసే ప్రాజెక్టును డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ (డీజీఎంఎల్) నిర్వహిస్తోంది. ఈ సంస్థ త్వరలోనే ఆ ప్రాంతంలో బంగారం ఉత్పత్తిని ప్రారంభించనుంది. ఈ గని దేశం బంగారు ఉత్పత్తిని గణనీయంగా పెంచనుందని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం ఏటా భారత్ సుమారు వెయ్యి టన్నుల బంగారాన్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. చమురు తర్వాత బంగారం దేశంలో అత్యధికంగా దిగుమతి అయ్యే వస్తువు కావడం విశేషం. ప్రస్తుతం భారత్ మొత్తం బంగారు ఉత్పత్తి కేవలం 1.5 టన్నులు మాత్రమే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే జొన్నగిరి బంగారు గని పూర్తిస్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించడం భారత్‌కు బంగారం విషయంలో ఒక కీలక ముందడుగుగా మారుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
ఇక ఈ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్న జియోమైసోర్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్‌లో డెక్కన్ గోల్డ్ మైన్స్ సంస్థకు వాటా ఉంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన పర్యావరణ అనుమతులు ఇప్పటికే లభించాయని.. రాష్ట్ర అనుమతులు కూడా కోరుతున్నట్లు డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ ఎండీ హనుమ ప్రసాద్ గురువారం వెల్లడించారు. ఇక ఈ గనిని ప్రారంభించిన తర్వాత తొలి దశలో.. ఏటా సుమారు 750 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేయనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత రానున్న 2, 3 ఏళ్లలో ఈ బంగారం ఉత్పత్తిని ఏటా వెయ్యి కిలోలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ ఎండీ హనుమ ప్రసాద్ వెల్లడించారు.
ఇక కర్నూలు జిల్లాలో ఉన్న ఈ గోల్డ్ మైన్ నుంచి ఉత్పత్తి ప్రారంభం అయిన తర్వాత.. భారత దేశీయ బంగారు ఉత్పత్తి దాదాపు ఒక టన్ను మేర పెరుగుతుందని హనుమ ప్రసాద్ వివరించారు. ఈ ప్రాజెక్ట్ దేశ బంగారు పరిశ్రమలో ఒక నూతన అధ్యాయాన్ని లిఖిస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక ఈ ప్రాజెక్టును నిర్వహిస్తున్న డెక్కన్ గోల్డ్ మైన్స్ సంస్థకు కిర్గిస్తాన్, ఫిన్లాండ్, టాంజానియా వంటి దేశాల్లో కూడా మైనింగ్ ప్రాజెక్టులను కలిగి ఉంది.
Social Plugin