ANDRAPRADESH, MACHILIPATNAM : బందరు పోర్టు శరవేగంగా రూపుదిద్దుకుంటుంది దీనికి అనుసంధానంగా ఉన్న జాతీయ రహదారులను విస్తరించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ముఖ్యంగా నేషనల్ హైవే 65, నేషనల్ హైవే లను కలుపుతూ ఒక ప్రత్యేక కూడలిని నిర్మించనున్నారు దీనివల్ల పోర్టుకు సరుకులు చేరవేయడం సులభమవుతుంది అంటున్నారు.అంతేకాదు తెలంగాణ నుంచి కూడా రవాణా మరింత సులువు కానున్నది ఈ ప్రాజెక్టుతో ప్రాంతీయ అభివృద్ధికి బాటలు పడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో మరో హైవే విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే బందరు పోర్టు త్వరలో అందుబాటులోకి రానుండటంతో.. ఆ హైవేను ఆరు వరుసలుగా విస్తరించాలని నిర్ణయించారు. అలాగే బందరు పోర్టుకు వెళ్లే రహదారి పనులు వేగంగా జరుగుతున్నాయి. నేషనల్ హైవే-65, నేషనల్ హైవే-216 లను పోర్టుకు అనుసంధానం చేస్తారు. దీని కోసం 127 ఎకరాల భూమిని సేకరించనున్నారు.. భూసేకరణపై చర్చించేందుకు జిల్లా మోర్త్ అధికారులు ఢిల్లీ వెళ్లారు.
మచిలీపట్నం దగ్గర నేషనల్ హైవే 65, నేషనల్ హైవే-216 రోడ్లు కలిసే చోట ఒక కూడలిని నిర్మించనున్నారు. దీని వల్ల పోర్టుకు వెళ్ళే వాహనాలకు ట్రాఫిక్ సమస్య ఉండదు. వచ్చే ఏడాది అక్టోబరు నాటికి పోర్టు నిర్మాణం పూర్తవుతుంది. ఈ కూడలి (క్రాస్ క్లోవర్ లీఫ్) త్వరగా పూర్తయితే అభివృద్ధికి మరింత ఉపయోగపడుతుంది. మచిలీపట్నం బైపాస్ వంతెన దగ్గర ఈ కూడలిని నాలుగు రింగులతో నిర్మిస్తారు. దీని వల్ల పోర్టుకు వచ్చే వాహనాలు నేరుగా వెళ్ళిపోవచ్చు. ఇతర వాహనాలతో కలిసే అవకాశం ఉండదు. దీని వలన ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. పోర్టు పూర్తయితే ఓడల రాకపోకలు పెరుగుతాయి.. ఈ సమయంలో కూడలి అందుబాటులోకి వస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు.
ఈ కూడలి (జంక్షన్) నిర్మాణం కోసం మూడు గ్రామాల పరిధిలో భూమిని సేకరించనున్నారు. మొత్తం 127 ఎకరాల భూమిని సేకరిస్తారు. ఎస్‌ఎన్‌గొల్లపాలెంలో 94 ఎకరాలు, అరిసేపల్లిలో 27 ఎకరాలు, మాచవరంలో 5 ఎకరాల భూమిని సేకరిస్తారు. ఈ మేరకు సర్వే నంబర్లను రెవెన్యూ అధికారులు పరిశీలించారు. వాటిని మినిస్ట్రీ ఆఫ్ రోడ్డు ట్రాన్స్‌పోర్టు అండ్ హైవేస్ (మోర్త్)కు పంపించారు. భూసేకరణ కోసం 3ఏ నోటిఫికేషన్‌ను మరో 15 రోజుల్లో ఇవ్వనున్నారు. ఈ ప్రక్రియకు దాదాపు రూ.600 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు.
నేషనల్ హైవే 216 ను విస్తరిస్తే తెలంగాణకు బందరు పోర్టుతో సంబంధం ఏర్పడుతుంది. దీనివల్ల భద్రాచలం, ఖమ్మం నుండి గ్రానైట్ రాయిని పోర్టుకు ఈజీగా పంపవచ్చు. అమరావతి ORR దగ్గర నుంచే ఈ రహదారి వెళ్తుంది కాబట్టి రాజధానికి వెళ్లడం సులువు అవుతుంది. ట్రాఫిక్ సమస్యలు కూడా ఉండవు. నూజివీడు మామిడి పండ్లు, మల్లవల్లి పరిశ్రమల ఉత్పత్తులను తేలికగా రవాణా చేయవచ్చు. ఇది తీర ప్రాంత రహదారి. దీనివల్ల ఆక్వా ఉత్పత్తులను పోర్టుకు ఎగుమతి, దిగుమతి చేయడానికి అవకాశం ఉంటుంది. మొత్తం మీద బందరు పోర్ట్ నిర్మాణంతో హైవే విస్తరణతో పాటుగా అమరావతికి, హైదరాబాద్‌కు కనెక్టివిటీ మరింత పెరుగుతుంది అంటున్నారు. ఈ పనుల్ని త్వరలోనే ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు అధికారులు.
Social Plugin