ఏపీలో అక్కడ కొత్తగా బస్ టెర్మినల్ 13 ఎకరాలలో.. బస్ బే హెలిపాడ్, మల్టీప్లెక్స్ లు, రూపిరేఖలే మారిపోతాయి..


 

ANDRAPRADESH, TIRUPATI:ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్ నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు అధికారులు రూపొందించిన ఐదు మోడల్స్ ను ఆదివారం పరిశీలించారు 13 ఎకరాలలో లక్ష మంది యాత్రికులు రాకపోకలు సాగించేందుకు వీలుగా అత్యాధునిక బస్ స్టేషన్ ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు తిరుపతిలో కొత్తగా నిర్మించే బస్సు స్టేషన్ కు సంబంధించి పలు కీలక సూచనలు చేశారు.

రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏడుకొండల వాడి పాదాల చెంత కొలువై ఉన్న తిరుపతిలో అత్యాధునిక సదుపాయాలతో బస్ స్టేషన్ (బస్ టెర్మినల్) నిర్మించాలని నిర్ణయించింది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య రాను రానూ పెరుగుతోంది. ప్రపంచం నలుమూలల నుంచి శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుపతిలో అత్యాధునిక సదుపాయాలతో బస్ స్టేషన్ నిర్మించాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.13 ఎకరాల విస్తీర్ణంలో కనీసం లక్ష మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్ నిర్మించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏపీఎస్ఆర్టీసీ, నేషనల్‌ హైవేస్‌ లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌ అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని బస్‌స్టేషన్లు ఆధునీకరించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. తిరుపతిలో నిర్మించే అత్యాధునిక బస్ స్టేషన్‌లో అన్ని సౌకర్యాలు ఉండాలని చంద్రబాబు సూచించారు. తిరుపతి బస్ స్టేషన్ కోసం అధికారులు రూపొందించిన ఐదు మోడళ్లను చంద్రబాబు ఆదివారం పరిశీలించారు. వీటిని మరింత అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. ఇందుకోసం భాగస్వామ్యులతో సమావేశం నిర్వహించాలని ఆదేశించారు.

మరోవైపు ఇకపై ఎలక్ట్రికల్ బస్సులను మాత్రమే కొనుగోలు చేయాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుపతిలో కొత్తగా నిర్మించే బస్‌స్టేషన్‌లో ఛార్జింగ్ సదుపాయాలు ఉండాలని చంద్రబాబు సూచించారు. అలాగే ఒకేసారి 150 బస్సులు నిలిపేలా బస్‌ బే నిర్మించాలని ఆదేశించారు. రెండ్ బస్ ఎంట్రీలు, ఎగ్జిట్లు ఉండాలని సూచించారు.

హెలిప్యాడ్‌, రోప్‌ వే సౌకర్యాలతో పాటుగా బస్ స్టేషన్‌లో మల్టీప్లెక్స్, కమర్షియల్‌ కాంప్లెక్స్‌లు, మాల్స్‌ ఉండేలా డిజైన్లు రూపొందించాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. తిరుపతిలో కొత్తగా నిర్మించే బస్ స్టేషన్‌లో సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేయాలని.. దీని సాయంతో బస్ స్టేషన్‌కు కావాల్సిన విద్యుత్ ఉత్పత్తి చేసుకునేలా ఏర్పాట్లు ఉండాలని స్పష్టం చేశారు.