ANDRAPRADESH, ELURU:ఏపీ ప్రభుత్వం Jldi నిర్ణయం తీసుకుంది. యూరియా సహా ఎరువుల అక్రమ నిల్వ, సరఫరాకు పాల్పడేవారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని భావిస్తోంది. ఈ విషయాన్ని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఎరువులు లభ్యత, సరఫరాపై సమీక్ష నిర్వహించిన ఆయన.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. వైసీపీ తప్పుడు ప్రచారం నమ్మవద్దని కోరారు. అందుబాటులో యూరియా ఉందని.. కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు.
ఎరువులను అనుమతులు లేకుండా నిల్వ చేయడంతో పాటుగా, అక్రమంగా తరలించే వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలనీ ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. ఎరువులు సరఫరా, పంపిణీపై ఏలూరులో మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి నాదెండ్ల మనోహర్.. రాష్ట్రంలో యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తోందన్న నాదెండ్ల మనోహర్.. ఏలూరు జిల్లాలో యూరియా సరఫరా, నిల్వలపై వాస్తవాలు తెలుసుకునేందుకు సమీక్షా సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. యూరియా విషయంలో వైసీపీ అబద్దాలు ప్రచారం చేస్తూ.. రైతుల గుండెల్లో అలజడి రేపేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు.
రైతుల సమస్యను రాజకీయ కోణం నుంచి చూస్తూ విషప్రచారం చేస్తున్నారన్న నాదెండ్ల మనోహర్.. వైసీపీ నేతలకు నిజంగా రైతులపై ప్రేమ ఉంటే వైసీపీ ప్రభుత్వం హయాంలో కొన్న ధాన్యానికి ఎందుకు సొమ్ము చెల్లించలేదని ప్రశ్నించారు. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారానికి రాగానే రైతులకు ధాన్యం బకాయిలను చెల్లించిన విషయాన్ని గుర్తు చేశారు. రాజకీయ లబ్ది కోసం వైసీపీ కుతంత్రాలకు పాల్పడుతోందని ఆరోపించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రైతాంగానికి భరోసా ఇస్తూ ముందుకు వెళ్తున్నారని మంత్రి వివరించారు. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఏలూరు జిల్లాలో ఇప్పటి వరకు 33,762 మెట్రిక్ టన్నులకు గాను 32,757 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశామన్నారు.
మరోవైపు ఉద్యాన పంటలైన పామాయిల్, పత్తి మిర్చి రైతులు ఎరువుల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ భరోసా ఇచ్చారు. ఖరీఫ్ సీజన్ తరహాలోనే ఉద్యాన పంటలకు కూడా సరైన సమయానికి ఎరువులు అందిస్తామన్నారు. యూరియా పంపిణీ కోసం ఏలూరు జిల్లాలో 530 పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశామన్న నాదెండ్ల మనోహర్.. ప్రతీ రైతుకూ ఆదాయం వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఏలూరు జిల్లాలో అక్రమంగా ఎరువుల తరలింపు అడ్డుకునేందుకు 22చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని.. ఇప్పటి వరకు 12 కేసులు నమోదు చేసినట్లు వివరించారు. ఎరువుల అక్రమ రవాణాదారులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు.
Social Plugin