సీఎం రేఖా గుప్తాపై దాడి కేసులో మరో వ్యక్తి అరెస్ట్.. అసలు సూత్రధారి ఇతడేనా?


 
CM Rekha Guptha Attack Case: ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై ఇటీవలే దాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఈ ఘటనలో వెంటనే నిందితుడిని అరెస్ట్ చేశారు. ముఖ్యంగా జన్ సువాయి కార్యక్రమం జరుగుతుండగా వచ్చిన రాజేష్ సకారియా అనే ఓ 41 ఏళ్ల వ్యక్తి.. సీఎంకు కొన్ని పత్రాలు అందజేశారు. ఆ తర్వాత కాసేపటికే గట్టిగా అరుస్తూ.. ఆమెపై దాడికి పాల్పడ్డారు. ఇష్టం వచ్చినట్లుగా కొట్టడంతో పాటు ఆమె జుట్టు కూడా పీకినట్లు అధికారులు తెలిపారు. అయితే విషయం గుర్తించిన వెంటనే అతడిని అదుపులోకి కూడా తీసుకోగా.. తాజాగా మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇతడే ప్రధాన సూత్రధారి కావచ్చని కూడా పోలీసులు భావిస్తున్నారు. మరి పోలీసులు అరెస్ట్ చేసిన ఈ రెండో వ్యక్తి ఎవరకు, అతడికి కేసుతో సంబంధం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి

.ఈ దాడి కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడు రాజేష్ భాయ్ ఖిమ్జీ భాయ్ సకారియాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారిస్తున్న క్రమంలోనే ఈ కేసులో మరో కీలకమైన నిందితుడి పాత్ర వెలుగులోకి వచ్చింది. రాజేష్‌తో కలిసి ఈ కుట్రలో భాగమైన తాహసీన్ సయ్యద్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాహసీన్ రాజేష్‌కి అత్యంత సన్నిహిత మిత్రుడు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన తాహసీన్.. ఈ దాడి జరగడానికి ముందు రాజేష్‌కు రెండు వేల రూపాయలను బదిలీ చేసినట్లు దర్యాప్తులో వెల్లడి అయింది. అయితే దాడికి ముందు ఈ డబ్బు బదిలీ జరగడం చూస్తుంటూ.. ఇద్దరూ కావాలనే సీఎంపై దాడికి ప్లాన్ చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈక్రమంలోనే పోలీసులు.. తాహసీన్‌ను అదుపులోకి తీసుకోవాలనుకున్నారు. అందుకోసం రాజ్‌కోట్‌ వెళ్లి.. అక్కడే అతడిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఢిల్లీకి తీసుకువచ్చారు. ఈ కేసులో పోలీసులు కేవలం ఈ ఇద్దరినే అరెస్ట్ చేసి ఆగిపోలేదు. రాజేష్ సకారియాకు సన్నిహితంగా ఉన్న మరో ఐదుగురు స్నేహితులను కూడా ప్రశ్నించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ దాడి వెనుక రాజకీయ ప్రేరణలు ఉన్నాయా లేదా వ్యక్తిగత కక్షలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

ఈ దాడి ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా నివాసమైన సివిల్ లైన్స్ వద్ద జరిగింది. ముఖ్యమంత్రి తన ఇంటి వద్ద ప్రజల నుంచి వినతులు స్వీకరించే బహిరంగ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రాజేష్ సకారియా ఒక ఫిర్యాదుదారుడిలా వచ్చాడు. తన కుటుంబ సభ్యుల్లో ఒకరిని జైలు నుంచి విడుదల చేయాలంటూ విజ్ఞప్తి చేయడానికి వచ్చినట్లు నటించి.. సమావేశంలోకి ప్రవేశించాడు. అయితే ముఖ్యమంత్రి దగ్గరకు రాగానే అకస్మాత్తుగా ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఆమెను బలంగా తోసి.. జుట్టు పట్టుకొని లాగాడు. ఈ ఘటనతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే రాజేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడి సమాచారాన్ని వెంటనే తెలుసుకున్న పోలీసులు క్షణాల్లో స్పందించి దర్యాప్తును వేగవంతం చేశారు.